1-844-626-BADI(2234)
info@v1.manabadi.siliconandhra.org

సిలికానాంధ్ర మనబడికి వాస్క్‌ సంస్థ గుర్తింపు

http://www.eenadu.net/nri/nri.aspx?item=nri-news&no=65


ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని సిలికానాంధ్ర మనబడి కార్యక్రమం ఇటీవల ప్రపంచంలోని ప్రాథమిక, మాధ్యమిక మరియు ఉన్నత విద్యాలయాలలోని పాఠ్య ప్రణాళిక, బోధనా పద్దతులు, యోగ్యతా నిర్థారణ తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసే వాస్క్‌ (వెస్ట్రన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ అండ్‌ కాలేజస్‌) సంస్థ ద్వారా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం మనబడి డీన్‌, అధ్యక్షులు రాజు చమర్తి కొన్ని నెలలపాటు అహర్నిశలు కృషి చేశారు. గుర్తింపు ప్రక్రియలో భాగంగా వాస్క్‌ అధికారులు మనబడిలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు మౌఖిక పరీక్షలను నిర్వహించడమే కాకుండా సాండియాగో, అర్కాడియలోని కొన్ని కేంద్రాలలో ఆకస్మిక పర్యటనలు కూడా చేపట్టారు.

వాస్క్‌ సంస్థ నుంచి మనబడికి గుర్తింపు వచ్చిన సందర్భంగా శాన్‌జోసెలోని పార్క్‌ సైడ్‌ హాల్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన వాస్క్‌ సంచాలకులు డాక్టర్‌ జింజర్‌ హన్నిక్‌ మాట్లాడుతూ… తాను ఎన్నో కేంద్రాలకు తనిఖీలకు వెళ్తుంటానని కానీ మనబడిలో తెలుగు నేర్చుకొంటున్న విద్యార్థులు ఎంతోగానో ఆకట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి ముఖ్య అతిథులుగా పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత డా.యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌, సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి, సిలికానాంధ్ర, మనబడి కార్యవర్గ సభ్యులు ఆనంద్‌ కుచిభోట్ల, రాజు చమర్తి, దీనబాబు కొండభట్ల, దిలీప్‌ కొండిపర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకమైన వాస్క్‌ గుర్తింపు లభించడం ద్వారా అమెరికాలోని అనేక స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లలో తెలుగుకు ప్రపంచ భాష గుర్తింపు లభించడం మరింత సులభతరం అవుతుందని, మనబడి అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు. అమెరికాలోని 35 రాష్ట్రాలు, 12కి పైగా దేశాలు, 6200 మంది విద్యార్థులతో క్రమబద్ధమైన పాఠ్యప్రణాళికతో తెలుగు వారాంతపు బోధనా తరగతులు నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి, ఇప్పటికే కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రేమోంట్‌ యూనిఫైడ్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌, నార్త్‌ కరోలినా, వేక్‌ కౌంటీ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లో, ఇల్లినాయిస్‌, మిచిగాన్‌ రాష్ట్రాలలోని చదివే విద్యార్థులు కళాశాలలో ప్రవేశానికి అర్హత సంపాదించటానికి కావలసిన ఫారన్‌ లాంగ్వేజ్‌ క్రెడిట్‌గా తెలుగుకు గుర్తింపు సాధించిందని మనబడి సంచాలకులు శ్రీదేవి గంటి వివరించారు.

Menu Title