1-844-626-BADI(2234)
info@v1.manabadi.siliconandhra.org

మనబడి తెలుగు మాట్లాట 4వ జాతీయ పోటీలు – Eenadu Coverage


డాలస్‌: అమెరికాలోని సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట నాలుగవ జాతీయ పోటీలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ప్రాంతీయ పోటీలను నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన 70 మంది చిన్నారులకు డాలస్‌లో పదరంగం, తిరకాటం పోటీలను ఏర్పాటు చేశారు. తెలుగు భాష సంస్కృతి, సాహిత్య అంశాలకు చెందిన పలు ప్రశ్నలకు చిన్నారులు చక్కగా సమాధానాలు చెప్పి బహుమతులను గెలుచుకున్నారు. 2007లో మొదలైన సిలికానాంధ్ర మనబడిలో ప్రస్తుతం 6000 మందికి పైగా చిన్నారులు తెలుగును నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ… ఈ తెలుగు మాట్లాట కార్యక్రమం పిల్లలలో భాషపై ఆసక్తి పెంచుతుందన్నారు. తెలుగు మాట్లాట సమన్వయకర్త నిడమర్తి శ్రీనివాస్‌ మాట్లాడుతూ… ఈ సంవత్సరం ఈ పోటీలకు ఆదరణ పెరిగిందన్నారు. అలాగే తల్లిదండ్రులు ఆశీస్సులతో అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలను తొందరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.

బుడతల వయో విభాగం (5నుంచి9 సంవత్సరాలు)లో నిర్వహించిన తిరకాటం పోటీల్లో మానికొండ సుధాస్రవంతి మొదటి బహుమతి గెలుపొందగా, కొల్లు మన్విత్‌ రెండో బహుమతిని గెలుపొందారు. అలాగే పదరంగం పోటీల్లో మానికొండ సుధాస్రవంతి మొదటి బహుమతిని గెలుచుకోగా, పంత్ర యశ్వంత్‌ రెండో బహుమతిని అందుకున్నాడు.

సిసింద్రీలు వయోవిభాగం (10 నుంచి 14 సంవత్సరాలు)లో ఏర్పాటు చేసిన తిరకాటం పోటీల్లో మొదటి బహుమతిని ఇంద్రగంటి సిరివెన్నెల అందుకోగా రెండో బహుమతిని ఘంటసాల శ్రీవైష్ణవి గెలుపొందింది. అలాగే పదరంగం పోటీల్లో కస్తూరి ప్రణవ్‌ చంద్ర మొదటి బహుమతిని గెలుపొందగా కొల్ల అరుల్‌ రెండో బహుమతిని సాధించుకున్నాడు.

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సాహితీవేత్త, అవధాని ఆచార్య పుదూర్‌ జగదీశ్వరన్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందచేశారు. స్థానిక శ్రీవెన్‌ సిస్టమ్స్‌ అధినేత, మనబడి భాషా సైనికుడు 116 డాలర్లను స్పాన్సర్‌ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Menu Title